After Inter: ఇంట‌ర్ త‌ర్వాత‌..ఎన్నో మార్గాలు..ఎంచుకునే మార్గ‌మే కీల‌కం! 10 d ago

featured-image

విద్యార్ధులు త‌మ‌ను తాము విశ్లేషించుకొని స‌రైన మార్గాన్ని ఎంచుకునే అవ‌కాశం తొలిసారి ప‌దో త‌ర‌గ‌తి త‌ర్వాత వ‌స్తుంది. మ‌ళ్లీ ఆ అవ‌కాశం ఇంట‌ర్మీడియ‌ట్ అనంత‌రం ద‌క్కుతుంది. ఈ ద‌శ‌లో తీసుకునే నిర్ణ‌య‌మే జీవితాన్ని మ‌లుపు తిప్పుతుంది. అయితే ఎంచుకోడానికి ఎన్నో దారులున్నా, అన్నీ విలువ‌యిన‌వే అయినా ఆ దారి మీకు స‌రిపోతుందా, లేదా అనేది ప‌రిశీలించ‌డం ముఖ్యం.


ప‌దో త‌ర‌గ‌తి త‌ర్వాత తీసుకున్న నిర్ణ‌యాల్లో ఏవైనా పొర‌పాట్లు జ‌రిగితే స‌రిదిద్దుకునేందుకు ఇంట‌ర్ త‌ర్వాత మ‌రోసారి అవకాశ‌మొస్తుంది. ఒక‌వైపు సాధార‌ణ డిగ్రీలు, మ‌రోవైపు ప్రొఫెష‌న‌ల్ కోర్సులు అన్నీ ఇంట‌ర్ త‌ర్వాతే మొద‌ల‌వుతాయి. వీటిలో ఇంజినీరింగ్‌, మెడిసిన్ మిన‌హా మిగిలిన వాటిలోకి ఇంట‌ర్మీడియ‌ట్ అన్ని గ్రూపుల విద్యార్ధుల‌కూ అవ‌కాశం ఉంటుంది. అందువ‌ల్ల అందుబాటులో ఉన్న అన్ని కోర్సుల‌పైనా అవ‌గాహ‌న పెంచుకుంటే ఎందులో చేరాలో సులువుగానే నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు.


విశ్లేషించుకోవ‌డానికి చివ‌రి అవ‌కాశం:

ఇంట‌ర్మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ గ్రూపు చ‌దివిన విద్యార్ధుల్లో కొంద‌రు రాణించ‌లేక‌పోవ‌డం అలాగే ఆస‌క్తి లేక‌పోవ‌డంతో ఇబ్బందులు ప‌డుతుంటారు. అయితే వీరు ఆ దారిలోనే కొన‌సాగాలా, మ‌రో మార్గంలో ముంద‌డుగేయాలా అన్న విష‌యంలో ఓ నిర్ణ‌యానికి రావ‌చ్చు. ఎంపీసీ, బైపీసీల్లో భ‌విష్య‌త్తును ఆశించేవారికి మేటి కోర్సులెన్నో ఉన్నాయి. అలాగే ఈ సైన్స్ గ్రూపుల‌ను వ‌దిలించుకోవాల‌నుకునేవారు రాణించ‌డానికి అవ‌కాశ‌మున్న చ‌దువుల సంఖ్యా త‌క్కువేం కాదు. అందువ‌ల్ల పూర్తిస్ధాయిలో స‌మీక్షించుకుని మంచి కెరియ‌ర్ లైఫ్‌ను నిర్మించుకోవ‌చ్చు. అయితే స‌మీక్షించుకోవ‌డానికి ఇదే చివ‌రి అవ‌కాశంగా భావించాలి.


కోర్సుని ఎంచుకోండిలా......

విద్యార్ధులు కోర్సుల‌ను ఎంచుకోవ‌డానికి ఎక్కువ సంఖ్య‌లో ఆప్ష‌న్లు ఉండ‌టంతో ఎందులో చేరాలో నిర్ణ‌యించుకోవ‌డం కొంచెం క‌ష్ట‌మ‌వుతోంది. అందువ‌ల్ల ఎవ‌రికి వారు ఆస‌క్తుల‌ను గ‌మ‌నించి ప్ర‌త్యేక‌త‌ల‌ను తెలుసుకోవాలి. బ‌లాల‌ను విశ్లేషించుకుని..బ‌ల‌హీన‌త‌లూ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. ఆ త‌ర్వాతే ఒక నిర్ణ‌యానికి రావాలి. చేరాల‌నుకున్న కోర్సు స్వ‌రూపం మ‌న‌కు స‌రిపోతుందా లేదా చూసుకోవాలి.

న‌చ్చిన కోర్సు ఎంచుకోవ‌డం మంచిదే. అయితే ఆ కోర్సులో ల‌భించే ఉన్న‌త విద్య‌, కోర్సు అనంత‌రం అందులో ఉండే అవ‌కాశాల‌పైనా అవ‌గాహ‌న ఉండాలి. ముఖ్యంగా కొత్త కోర్సులు ఎంచుకున్న‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ముంద‌డుగేయాలి. ఇంట‌ర్మీడియ‌ట్ గ్రూపుల వారీ విద్యార్ధుల‌కు ఉన్న అవ‌కాశాలు, అన్ని గ్రూపుల వారికీ ఉమ్మ‌డిగా ఉండే దారుల వివ‌రాలు తెలుసుకుంటే ఒక‌ నిర్ణ‌యం తీసుకోవ‌డం తేలిక‌వుతుంది.


ఇంట‌ర్ ఏ గ్రూప్ తీసుకున్న వారైనా స‌రే

ఇంట‌ర్ ఏ గ్రూప్ విద్యార్దులైనా అజీం ప్రేమ్‌జీ యూనివ‌ర్సిటీ రెసిడెన్షియ‌ల్ విధానంలో అందిస్తున్న‌ బీఏ కోర్సులో చేర‌వ‌చ్చు. అలాగే టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్ బీఏ సోష‌ల్ సైన్సెస్‌, బ్యాచిల‌ర్ ఆఫ్ సోష‌ల్ వ‌ర్క్ కోర్సుల‌ను అందిస్తోంది. సీఏ, సీఎంఏ, సీఎస్ వంటి కోర్సుల్లో ఇంట‌ర్మీడియ‌ట్ ఏ గ్రూప్ తీసుకున్నా ఇటువంటి ప్రొఫెషన‌ల్ కోర్సుల కోసం న‌మోదు చేసుకోవ‌చ్చు.


అలాగే లా, లిబ‌ర‌ల్ స్ట‌డీస్‌, డీఎడ్‌, ఇంటిగ్రేటెడ్ బీఎడ్‌, సీఏ, సీఎంఏ, సీఎస్ హోట‌ల్ మేనేజ్‌మెంట్‌, హాస్పిటాలిటీ, టూరిజం. ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఎంబీఏ, బీబీఎం, బీబీఏ, బీసీఏ, బీఏ, బీఎస్‌డ బ్ల్యూ. ఫైన్ ఆర్ట్స్‌, విదేశీ భాష‌లు, ఎయిర్ హోస్టెస్ అండ్ ఫ్లయిట్ స్టివార్డ్‌, ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ కోర్సులు, డిజైన్‌, ఫ్యాష‌న్‌, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌, డిప్లొమా/ స‌ర్టిఫికేట్ కోర్సులు, వొకేష‌న‌ల్ కోర్సులు లాంటివి చేయొచ్చు.


గ్రూపు ఏదైనా టీచింగ్ కోర్సుల్లో చేరొచ్చు

ఇంట‌ర్మీడియ‌ట్ లో ఏ గ్రూప్ తీసుకున్న విద్యార్ధులైనా టీచింగ్ కోర్సుల్లో చేర‌వ‌చ్చు. వీరు డీఎడ్ చ‌ద‌వ‌డానికి డైట్ సెట్ రాసుకోవ‌చ్చు. ప‌రీక్ష‌లో చూపిన ప్ర‌తిభ ద్వారా ప్ర‌వేశాలు ల‌భిస్తాయి. ప్ర‌భుత్వ, ప్రైవేటు ఆధ్వ‌ర్యంలో ప‌లు డైట్‌లో డిప్లామా ఇన్ ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్ కోర్సును రెండేళ్ల వ్య‌వ‌ధితో అందిస్తున్నాయి. ఈ కోర్సును విజ‌య‌వంతంగా పూర్తిచేసుకున్న‌వారు సెకెండ‌రీ గ్రేడ్ టీచ‌ర్ (ఎస్‌జీటీ) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అలాగే ఇంట‌ర్మీడియ‌ట్ అనంత‌రం నాలుగేళ్ల వ్య‌వ‌ధితో వివిధ సంస్ధ‌లు అందిస్తోన్న బీఏఎడ్‌(B.A.Ed.), బీఎస్సీ ఎడ్(B.Sc.Ed.) కోర్సుల‌నూ చ‌దువుకోవ‌చ్చు.


హోట‌ల్ మేనేజ్‌మెంట్‌...

ఆతిథ్య రంగంలో సేవ‌లందించాల‌నుకునేవారు, నిర్వ‌హ‌ణ నైపుణ్యం ఉన్న‌వారు, క్ర‌మ‌ప‌ద్ద‌తిలో స‌ర్ధ‌డాన్ని ఇష్ట‌ప‌డేవారు... వీరంతా హోట‌ల్ మేనేజ్‌మెంట్ కోర్సుల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌వ‌చ్చు. జాతీయ‌, రాష్ట్ర స్ధాయుల్లో ప‌లు సంస్ధ‌లు బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోట‌ల్ అడ్మినిస్ట్రేష‌న్, బ్యాచిల‌ర్ ఆఫ్ క‌లిన‌రీ ఆర్ట్స్ కోర్సుల‌ను అందిస్తున్నాయి. ఇంట‌ర్ ఏ గ్రూప్ విద్యార్ధులైనా వీటిని చ‌దువుకోవ‌చ్చు. ప‌రీక్ష‌లో చూపిన ప్ర‌తిభ ఆధారంగా లేదా మార్కుల మెరిట్‌తో ప్ర‌వేశాలుంటాయి.


ఇంట‌ర్ అర్హ‌త‌తో ఉన్న మార్గాల్లో డిజైన్ ఒకటి. ఇందుకోసం జాతీయ‌, రాష్ట్ర స్ధాయుల్లో ప‌లు సంస్ధ‌లు ఉన్నాయి. నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ (నిఫ్ట్‌) దేశ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధి పొందిన సంస్ధ‌. అలాగే నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐటీ) కూడా ముఖ్య‌మైన‌దే. ఐఐటీ బాంబే, గౌహ‌తితో పాటు ప‌లు సంస్థ‌లు డిజైన్ కోర్సులు అందిస్తున్నాయి. ప‌రీక్ష‌లో చూపిన ప్ర‌తిభ‌తో ప్ర‌వేశం క‌ల్పిస్తారు.


ఫుట్‌వేర్ కోర్సులు

పాద‌రక్ష‌ల తయారీ శిక్ష‌ణ‌కు ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌, సెంట్ర‌ల్ ఫుట్‌వేర్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఇంట‌ర్ అర్హ‌త‌తో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.


ఫైన్ ఆర్ట్స్‌

ఇంట‌ర్ త‌ర్వాత ప్ర‌త్యేక అభిరుచులు ఉన్న‌వారు ఫైన్ఆర్ట్స్ బాట ప‌ట్ట‌వ‌చ్చు. పెయింటింగ్‌, ఫోటోగ్ర‌ఫీ, యానిమేష‌న్‌, అప్లైడ్ ఆర్ట్స్‌, స్క‌ల్ప్‌చ‌ర్‌.....మొద‌లైన కోర్సులెన్నో ఉన్నాయి. వీటికోస‌మే ప్ర‌త్యేకంగా ఏపీ, తెలంగాణ‌ల్లో ఆర్ట్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివ‌ర్సిటీలు ఏర్పాట‌య్యాయి. వీటిలో ఇంట‌ర్ విద్యార్ధుల కోసం అండ‌ర్ గ్రాడ్యుయేష‌న్‌లో బ్యాచిల‌ర్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్‌(బీఎఫ్ఏ)లో పైన పేర్కొన్న కోర్సులు అందిస్తున్నారు. ఆంధ్రా, ఉస్మానియా స‌హా ప‌లు యూనివ‌ర్సిటీల్లో యూజీ స్ధాయిలో ఈ కోర్సులు ఉన్నాయి. జాతీయ స్ధాయిలోనూ ప‌లు సంస్ధ‌లు ఫైన్ఆర్ట్స్ అందిస్తున్నాయి.


విదేశీ భాష‌లు

ప్ర‌స్తుతం అన్ని రంగాలు, విభాగాల్లో విదేశీ భాష‌లు వ‌చ్చిన‌వాళ్ల‌కు ప్రాధాన్యం పెరిగింది. జ‌ర్మ‌న్‌, స్పానిష్‌, ఫ్రెంచ్, ఇటాలియ‌న్‌, ప‌ర్షియ‌న్‌, చైనీస్‌...ఇలా ఏదో ఒక భాష‌లో నైపుణ్యం పెంచుకుంటే సుస్థిర కొలువును సొంతం చేసుకోవ‌చ్చు. హైద‌రాబాద్‌లోని ఇఫ్లూతోపాటు ప‌లు విశ్వ‌విద్యాల‌యాలు డిగ్రీలో ఒక స‌బ్జెక్టుగా విదేశీ భాష‌ల‌ను అందిస్తున్నాయి. ప‌రీక్ష‌తో ప్ర‌వేశాలుంటాయి.


‘లా’ కోర్సులు

న్యాయ‌విద్య ల‌క్ష్య‌మైన‌వారు ఇంట‌ర్ అర్హ‌త‌తో ముందుకెళ్ల‌వ‌చ్చు. లా కోర్సుల్లో ప్ర‌వేశానికి ప‌లు మార్గాలు ఉన్నాయి. రాష్ట్రస్థాయి విద్యా సంస్ధ‌ల్లోకి లాసెట్‌, జాతీయ స్ధాయిలో పేరొందిన సంస్ధ‌ల్లోకి క్లాట్‌, ప్రైవేటు సంస్ధ‌ల్లోకి ఎల్‌శాట్‌... మొద‌లైన ప‌రీక్ష‌లు ఉన్నాయి. వీటిద్వారా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ/బీఎస్సీ/బీకాం-ఎల్ ఎల్‌బీ కోర్సుల్లో చేరిపోవ‌చ్చు.


విద్యార్ధులంతా ఎవ‌రికి వారే ప్ర‌త్యేకం. నైపుణ్యాలు, బలాలు, బ‌ల‌హీన‌త‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని భ‌విష్య‌త్తును నిర్ణ‌యించుకోవాలి. ఇలా చేస్తేనే తీసుకున్న నిర్ణ‌యానికి న్యాయం చేయ‌గ‌లం. ఫ‌లితంగా చ‌దువుల్లో రాణించ‌డం సులువ‌వుతుంది.



ఇది చదవండి: ఇంట‌ర్ త‌ర్వాత ఇంజినీరింగా? లేక డిగ్రీ కోర్సులా?


Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD